
మాజీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై కేసు నమోదు
పులివెందుల, మన జనప్రగతి, నవంబర్ 03:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనతో పాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పులివెందులలో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో పాటు, ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైనట్లు సమాచారం. పోలింగ్ కేంద్రం వద్ద, రిటర్నింగ్ అధికారి కార్యాలయం సమీపంలో చోటుచేసుకున్న నిరసన పరిణామాలకు సంబంధించి అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో తమ పార్టీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదని, ఏజెంట్లు లేకుండానే ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నారని ఆరోపిస్తూ వైఎస్ జగన్ నిరసనకు దిగారు. ఈ పరిణామాలతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి తాజాగా జగన్, అవినాష్ రెడ్డిపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.