
కర్నూలు బ్యూరో మన జనప్రగతి మార్చి 06:- తల్లిదండ్రులు పడే కష్టాలను గుర్తించి, విద్యార్థులు కష్టపడి క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నర్సింగ్ విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు.శుక్రవారంనగరం లోని కిసాన్ ఘాట్ వద్ద ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఎం.పి(ఏల్ ఎస్) నిధులతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు మంజూరైన బస్సును కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తను ఎంపీగా గెలిచిన తర్వాత, సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బంది వచ్చి గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే నర్సింగ్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఒక బస్సు కావాలని అడగడం జరిగిందన్నారు. ఆ రోజు ఇచ్చిన హామీలో భాగంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద బస్సును శాంక్షన్ చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ బస్సును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. కళాశాలలో ప్రిన్సిపాల్, లెక్చరర్ల ఇచ్చే సలహాలను పాటిస్తూ చదువును నిర్లక్ష్యం చేయకుండా బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలకు కూడా బస్సు కావాలని కోరడం జరిగిందని, వచ్చే బడ్జెట్లో మెడికల్ కాలేజీకి తప్పకుండా నిధులు కేటాయించి బస్సు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో ఈ కాలేజీకి ఏ అవసరం ఉన్నా తన వంతు సహకారం అందిస్తానన్నారు.
క్లినికల్ ట్రైనింగ్, ఇతర విద్యా పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదువుకొని జీవితంలో స్థిరపడాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డా.చంద్రశేఖర్, సిపిఓ భారతి, డిఎంహెచ్ఓ డా.భాస్కర్, జి జి హెచ్ సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.చిట్టి నరసమ్మ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.




