
గ్రంథాలయ నిర్మాణంతో బ్రౌన్‌ను అజరామరం చేసిన జానమద్ది
కడప, అక్టోబరు 20 (మన జనప్రగతి): సి.పి. బ్రౌన్కు స్మారక చిహ్నంగా గ్రంథాలయాన్ని నిర్మించి, ఆయనను చిరస్మరణీయుడిగా నిలిపిన ఘనత తన తండ్రి డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రికి దక్కుతుందని సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహామండలి సభ్యుడు జానమద్ది విజయభాస్కర్ పేర్కొన్నారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో మంగళవారం జానమద్ది హనుమచ్ఛాస్త్రి 102వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విజయభాస్కర్ మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులు మొదలుకొని పలువురు దాతల నుంచి విరాళాలు సేకరించి, అరుదైన గ్రంథాలను సమకూర్చి బ్రౌన్ గ్రంథాలయాన్ని గొప్ప విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దారని తెలిపారు.
సహాయ పరిశోధకులు డా. భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి మాట్లాడుతూ, జానమద్ది బహుభాషావేత్తగా పలు రచనలు చేశారని, గ్రంథాలయ అభివృద్ధికి జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. గ్రంథాలయ సహాయకులు ఎన్. రమేశ్‌రావు, సహాయ పరిశోధకులు జి. హరిభూషణరావు జానమద్ది సేవలను స్మరించుకున్నారు. రచయిత కొత్తపల్లె రామాంజనేయులు ఆయనపై రాసిన కవితను వినిపించారు.
కార్యక్రమంలో పరిశోధన కేంద్రం జూనియర్ అసిస్టెంట్ ఆర్. వెంకటరమణ, సిబ్బంది, పాఠకులు కరీముల్లా పాల్గొన్నారు.




