
లింగాల మన జనప్రగతి మార్చి 06:కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన పోలీస్ స్టేషన్ భవన పనులను జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పులివెందుల పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
లింగాలలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న కొత్త పోలీస్ స్టేషన్ భవన పనులు తుది దశకు చేరుకున్నాయని, అతి త్వరలోనే దీనిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రారంభోత్సవానికి ముందే పనుల నాణ్యతను, పురోగతిని స్వయంగా పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు.పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.భవన ప్రారంభోత్సవానికి రాష్ట్ర హోంమంత్రి హాజరవుతారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. హోంమంత్రి రాకపై ఇంకా అధికారికంగా షెడ్యూల్ ఖరారు కాలేదని తెలిపారు. అయితే,ఇది శాఖాపరమైన కీలక కార్యక్రమం కావడంతో హోంమంత్రి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




