
పులివెందుల అర్బన్ మన జనప్రగతి మార్చి 04:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కీలక అంశాన్ని లేవనెత్తారు.రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, ఉద్యోగుల బదిలీలు ఇంకా పాత (ఉమ్మడి) జిల్లాల ప్రాతిపదికనే జరుగుతున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి లేవనెత్తిన ప్రధానాంశాలు
కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించారని, అయితే బదిలీల ప్రక్రియ మాత్రం ఇంకా పాత జిల్లాల ప్రకారమే ఉండటం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
భార్యాభర్తల సమస్య,ఒకరు ఒక జిల్లాలో,మరొకరు వేరే జిల్లాలో పని చేస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని,ముఖ్యంగా టీచర్లు మరియు పంచాయతీరాజ్ ఉద్యోగులకు ఈ సమస్య ఎక్కువగా ఉందని వివరించారు.
ఉద్యోగులు మనశ్శాంతితో పనిచేసినప్పుడే ప్రభుత్వ పాలన ప్రజలకు సమర్థవంతంగా అందుతుందని,అందుకే బదిలీల విధానాన్ని కొత్త జిల్లాల ప్రకారం మార్చాలని కోరారు.ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు గౌరవ మంత్రి స్పందిస్తూ,ప్రస్తుతం బదిలీలపై నిషేధం కొనసాగుతోందని పేర్కొన్నారు.భవిష్యత్తులో బదిలీల ప్రక్రియను ప్రారంభించినప్పుడు,ఎమ్మెల్సీ సూచించిన విధంగా ఉద్యోగులకు మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా,వారి సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని సభలో హామీ ఇచ్చారు.




