
పులివెందుల అర్బన్ మన జనప్రగతి ఫిబ్రవరి 26:-పులివెందుల నియోజకవర్గంలో వివాదాస్పద అధికారులుగా పేరు తెచ్చుకున్న డీఎస్పీ మురళి నాయక్,సీఐ ఎన్వీ రమణల చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది.గతంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ పార్నపల్లి కిషోర్‌ను అక్రమంగా నిర్బంధించి,కులం పేరుతో దూషిస్తూ చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) సీరియస్ అయింది.బాధితుడు కిషోర్ ఫిర్యాదును విచారించిన కమిషన్,నాలుగు వారాల్లోగా సదరు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీని ఆదేశించింది.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలను తొలగించారనే నెపంతో కౌన్సిలర్ కిషోర్‌తో పాటు మరో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ రాత్రి వారిని రహస్యంగా వేముల పోలీస్ స్టేషన్‌కు తరలించి,థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు ఆరోపించారు.అసలు వేముల స్టేషన్‌కే తీసుకెళ్లలేదని పోలీసులు వాదించినప్పటికీ అక్కడ తనను కులం పేరుతో దూషించారని,కక్ష సాధింపుగా అక్రమ రౌడీషీట్ ఓపెన్ చేశారని కిషోర్ ఆధారాలతో సహా మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.ఈ క్రమంలోనే మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ వంటి కీలక నేతలను కూడా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు వార్తలు వచ్చాయి.
అవినీతి చిచ్చు ఏసీబీ విచారణలో డీఎస్పీ పేరు..?
మరోవైపు సీఐ ఎన్వీ రమణ ఇప్పటికే ఏసీబీకి చిక్కి సస్పెన్షన్‌లో ఉన్నారు.స్టేషన్లోనే లంచం తీసుకుంటూ పట్టుబడటంతో పాటు,ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో అక్రమ మద్యం,భారీగా బంగారం,ఆస్తి డాక్యుమెంట్లు లభించడం కలకలం రేపింది.సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ ఏసీబీ విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం,డీఎస్పీ మురళి నాయక్ చెప్పడం వల్లే తాను లంచం తీసుకున్నానని చెప్పడంతో,డీఎస్పీ కూడా ఇప్పుడు ఏసీబీ కేసులో ఇరుక్కున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.వివాదాస్పద అధికారుల వైఖరి
ప్రజలను కాల్చి పారేస్తానంటూ గతంలో బహిరంగంగా హెచ్చరించి వివాదాల్లో నిలిచిన డీఎస్పీ మురళి నాయక్,ఇప్పుడు అటు ఏసీబీ,ఇటు మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో ఇరకాటంలో పడ్డారు.అత్యంత వివాదాస్పదంగా మారిన ఈ ఇద్దరు అధికారులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.




