
తొండూరు మన జనప్రగతి ఫిబ్రవరి 26:-మార్చిలో నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తొండూరు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.వి.సుబ్బారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు.పాఠశాలలో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తొండూరు మండల విద్యాశాఖ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పరీక్షలను విజయవంతంగా రాయాలని,అత్యధిక మార్కులు సాధించి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని సూచించారు.ఉపాధ్యాయులు తమ ప్రసంగాల్లో పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమాలు,సమయపాలన,ప్రశ్నాపత్రం చదివే విధానం వంటి అంశాలపై విద్యార్థులకు సమగ్ర సూచనలు అందించారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం విజయానికి ముఖ్యమని పేర్కొన్నారు.సమావేశం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. సినిమా పాటలు,భక్తి గీతాలకు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.




